31 March, 2026 | 4:17 AM

పండుగ వాతావరణంలో గ్రామసభ నిర్వహించాలి

31-03-2026 01:07 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, మార్చి 30 (విజయక్రాంతి): పండుగ వాతావరణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ గ్రామసభ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామసభ నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించాలని అన్నారు.

గ్రామసభ నిర్వహణలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని అన్నారు. మండల స్థాయి అధికారులను వివిధ గ్రామ పంచాయతీల్లో నిర్వహించే గ్రామసభలలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మండల ప్రత్యేక అధికారులు కూడా గ్రామసభ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా ప్రతినిధులందరు గ్రామ సభల్లో పాల్గొనే విధంగా ఆహ్వాన పత్రికలు అందించాలని కలెక్టర్ తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి గత 2.5 సంవత్సరాల కాలంలో అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన ప్రింటెడ్ మెటీరియల్ అందించాలని కలెక్టర్ తెలిపారు. అభయహస్తం గ్యారంటీ పథకాలు, సన్న బియ్యం సరఫరా వంటి అనేక పథకాలకు సంబంధించిన వివరాలు గ్రామ సభలో ప్రజల ముందు వినిపించాలని అన్నారు. పండుగ వాతావరణంలో గ్రామ సభలు జరగాలని, దానికి అనుగుణంగా ఎల్.ఈ.డి. స్క్రీన్, సౌండ్ సిస్టం, స్టేజీ డెకరేషన్ ఉండాలని కలెక్టర్ సూచించారు.

రాష్ట్ర గీతంతో గ్రామ సభ ప్రారంభం అవుతుందని, అనంతరం సీఎం సందేశం, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలు తెలియజేయడం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు తెలియజేయడం, లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవడం, ప్రజా ప్రతినిధుల సందేశంతో కార్యక్రమం ఉండాలని తెలిపారు. ఈ నిధులు వినియోగిస్తూ గ్రామసభ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, పంచాయతీ అధికారి ప్రత్యేకంగా గ్రామ సభల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు,  కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.