14 March, 2026 | 7:34 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

14-03-2026 02:11 AM
  1. ఆర్గానిక్ ఫార్మింగ్‌లో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేయండి 
  2. వ్యవసాయ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్‌లు పెట్టండి 
  3. వ్యవసాయ శాఖ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి13 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్‌లో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములుగా చే యాలని వ్యవసాయ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డితో కలిసి ప్రీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు, పూల సా గు చేయించి ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్ గోడౌన్లు, వేర్ హౌసింగ్ గోదాములపై సోలార్ రూఫ్ టాప్‌లు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ శాఖకు విద్యుత్ ఖర్చులు మిగలడంతోపాటు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించుకునే అవకాశం, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని తెలి పారు.

వ్యవసాయ శాఖ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్‌ల ఏర్పాటుకు సంబంధించి రెడ్కో సంస్థను సంప్రదించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టని అనేక సంక్షేమ పథకాలను రైతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను పంపిణీ చేస్తుందని, విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నామని మం త్రి తుమ్మల తెలిపారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని ఈ అంశాన్ని రైతులకు చక్కగా వివరించాలని మంత్రులు సూచించారు.

రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల కింద రకరకాల పంటలు సాగుచేస్తున్న తీరు, నీటి సరఫరా, యాసంగి వరిసాగు, మార్కెట్లోకి రానున్న ధాన్యం, సేకరణ తదితర అంశాలపై మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.