వైభవంగా నృసింహ జయంతి ఉత్సవాలు
నేటి నుంచి 30 వరకు నిర్వహణ
దేవస్థానం ఈఓ భవాని శంకర్
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుననట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ తెలిపారు.
శనివారం కొండపైన ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలను యాదగిరిగుట్టలో ఆదివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు,అనుబంధ ఆలయమైన పాతగుట్టలో 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వా మివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని అన్నారు.
ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో యాదగిరిగుట్టలో ఐదు రోజులు, పాతగుట్టలో నాలుగు రోజులు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య-శాశ్వత సేవలు, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు.
యాదగిరిగుట్టలో 26న, పాతగుట్ట ఆలయంలో 27న వివిధ పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం స్వామివారికి వివిధ అలంకార సేవలు నిర్వహించనున్నారన్నారు. ఈనెల 30న గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా కొండకింద అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణం చేస్తారని వేల సంఖ్యలో భక్తులు పాల్గొనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, దేవస్థానం ప్రధాన అర్చకుడు తాడూరి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.






