10 June, 2026 | 2:42 AM

సొంత విద్యుత్ వనరుల సృష్టే లక్ష్యం

10-06-2026 12:34 AM
  1. నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం
  2. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు
  3. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన అందుబాటులో ఉన్న భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జలసౌధలో నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేవలం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకే పరిమితం కాకుండా సొంత విద్యుత్ వనరులను సృష్టించుకునే దిశగా ముందడుగు వేయాలని ఆయన సూచించారు. నీటిపారుదల శాఖ భూములు, కాలువలపై సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు భారీ స్థాయిలో విద్యుత్ వ్యయం జరుగుతోందని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించేందుకు సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అవకాశాలను విస్తృతంగా పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతిపాదనల రూపకల్పన కోసం శాఖలోని సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవడంతో పాటు అవసరమైతే బయటి నుండి కుడా నిపుణ సంస్థల సహకారాన్ని  తీసుకోవచ్చని మంత్రి తెలిపారు.

ఇప్పటికే శాఖ వద్ద అందుబాటులో ఉన్న అధ్యయనాలు, ప్రజెంటేషన్లను వినియోగించి ఆలస్యం లేకుండా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అధికారుల ప్రజెంటేషన్ ప్రకారం రాష్ట్రంలోని సుమారు 16 జలాశయాల వద్ద సాధ్యతా అధ్యయనాలు నిర్వహించారని, అనుకూలమైన జలాశయాలు, నీటిపారుదల భూముల్లో కేవలం 10 శాతం విస్తీర్ణాన్ని మాత్రమే వినియోగించినా దాదాపు 6,000 నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టించే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, నోడల్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. మంజీరా, సింగూరు వంటి జలాశయాల్లో తేలియాడే సౌర విద్యుత్ (ఫ్లోటింగ్ సోలార్) ప్రాజెక్టుల అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కాలువలపై సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన బిల్డ్- ఓన్- ఆపరేట్- ట్రాన్స్‌ఫర్ నమూనా ప్రాజెక్టును అధికారులు వివరించారు.

జాగోరా- మధ్య సుమారు 15 కిలోమీటర్ల కాలువపై ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ పెట్టుబడి లేదా భూసేకరణ అవసరం ఉండదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడి, సంవత్సరానికి సుమారు 340 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. ఇందులో ప్రాజెక్టు అవసరాలకు సుమారు 84 లక్షల యూనిట్లు వినియోగించుకుని, మిగిలిన 255 లక్షల యూనిట్ల విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఏటా సుమారు రూ.11.5 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని తెలిపారు.

అదేవిధంగా విద్యుత్ కొనుగోలు వ్యయంలో ఏటా రూ.6.2 కోట్ల వరకు ఆదా అవుతుందని, 25 సంవత్సరాల కాలంలో ఇది సుమారు రూ.155 కోట్ల పొదుపుకు దారి తీస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 8వేల ఎకరాలకు స్థిరమైన విద్యుత్, నీటి మద్దతు లభిస్తుంద న్నారు. పునరుత్పాదక ఇంధన వినియోగం, కాలువలలో నీటి ఉష్ణోగ్రత తగ్గడం, ఆవిరైపోయే నీటి పరిమాణం తగ్గుతుందన్నారు.