బీసీల రాజ్యాధికారమే లక్ష్యం
- టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- భువనగిరి గడ్డపై పార్టీ జెండా ఆవిష్కరణ
- జూన్ 2 నుంచి మల్లన్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 17(విజయక్రాంతి): తెలంగాణలో బీసీల ఆత్మగౌరవం, రాజ్యాధికారం సాధనే ధ్యేయంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశాయి.
ఈ సందర్భంగా ఆలేరు, భువనగిరి కేంద్రాలతో పాటు తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మల్లన్న కోనాపూర్, గంధమల్ల, ఇబ్రహీంపూర్, ఇందిరా నగర్, దత్తయి పల్లి, వెల్పల్లి గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో మల్లన్నకి ప్రజలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. కాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరారు. మల్లన్న వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం భువనగిరిలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకెళ్లేందుకు జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కుల గణనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, అశాస్త్రీయమైన పద్ధతులతో బీసీల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నటికీ బీసీలకు న్యాయం చేయలేవని, అవి కేవలం అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని విమర్శించారు.బీసీల బ్రతుకులు మారాలన్నా, సంపద, భూమి, ఉద్యోగాలు బీసీల చేతికి రావాలన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రతి బీసీ గడపకూ పార్టీ సిద్ధాంతాలను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సామాజిక అసమానతలు తొలగి, బీసీలకు రాజ్యాధికారం దక్కినప్పుడే నిజమైన తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నరసింహులుతో పాటు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, గ్రామస్థా యి కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






