బీసీలకు న్యాయం చేయాలి
- లేదంటే కేంద్రాన్ని గద్దె దింపుతాం
ఓబీసీలకు ద్రోహం చేస్తున్న ప్రధాని మోదీ
కుల గణన లెక్కలు తేలినాకే డీలిమిటేషన్ చేపట్టాలి
బీసీ నేతలు జాజుల, వీహెచ్, మధుసూదనా చారి, శ్రీనివాస్ గౌడ్
ఢిల్లీలో నిరసన చేపట్టిన బీసీ సంఘాలు
హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జరుగుతున్న సమగ్రకుల గణన పూర్తికాకుం డానే డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టడాన్నినిరసిస్తూ శుక్రవారం దేశ రాజధానిలో బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.మాజీ ఎంపీ వి హనుమంతరావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూ దనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్‌రావులు ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డీలిమిటేషన్, మహిళా బిల్లు వల్ల దేశంలో ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలకు పోయినట్టు ఉందని ఎద్దేవా చేశారు. గత 11 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలోని 80 కోట్ల మంది బీసీలకు ఏమీ చేయని వారు ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను గౌరవించని మోదీ తాను బీసీ ప్రధాని అని చెప్పుకునే నైతిక హక్కు లేదన్నారు.
డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదని, అగ్రకులాల ఆధిపత్యం ఇంకా పెరుగుతుందని ఆయన ఆరోపించారు. చట్టసభలలో బీసీలకు రాజకీయ ప్రాతిని ధ్యం కల్పించకుండా ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టిన బీసీలకు ఒరిగిం దేమీ లేదని, బీసీ మహిళకు సబ్ కోట లేకుండా బిల్లు ను పార్లమెంట్లో ఆమోదించి బీజేపీ బీసీల ద్రోహుల పార్టీగా చరిత్రలో మిగిలిపోవద్దని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ బీసీ ప్రధాని కూడా బీసీలకు ద్రోహం చేస్తున్న చరిత్ర నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు. ఎన్నిసార్లు రాజ్యాంగ సవరించిన మోదీ బీసీల కోసం ఉపయోగించకపోవడం దురదృష్టకరమన్నారు, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పల్లెకు పల్లెకు తిరిగి బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడుతామని వీహెచ్ హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ నేతలు సిరికొం డ మధుసూదనా చారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్‌లు మాట్లాడుతూ మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దేశంలో బీసీలను రాజకీయంగా అణచిపెట్టే కార్యక్రమం బీజేపీ తీసుకుంటుందని మండిపడ్డారు, స్థానిక సంస్థల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఏ విధంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నారో అదే విధంగా చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్‌రావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై 80 కోట్ల మంది తిరగబడడం ఖాయమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కుమ్మరి క్రాంతి కుమార్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, కుందారం గణేష్ చారి, బి మనీ మంజరి సాగర్,కనకల శ్యాంకుర్మా, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, జాజుల లింగం గౌడ్, గూడూరు భాస్కర్, తారకేశ్వరి, సంధ్యారాణి, స్వర్ణ గౌడ్, కౌలే జగన్నాథం,సుజాత, గౌతమి, విజయలక్ష్మి, బండి గారి రాజు గౌడ్, ఉదయనేత, అంజమ్మ, డేగ అనిల్ కుమార్, త్రిలోక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.






