26 July, 2026 | 2:12 AM

ఇంటింటా గోరింట సందడి

26-07-2026 12:00 AM

కామారెడ్డి (విజయక్రాంతి): ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో గోరింటాకు సందడి నెలకొంది. మహిళలు నోములు, వ్రతాలు, శుభకార్యాల సందర్భంగా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. విద్యార్థినులు, మహిళలు, యువతులు, వివిధ రకాల ఆకర్షణీయమైన డిజైన్లతో చేతులను  మెహందితో అలంకరించుకుంటూ పండుగ వేడుకలకు మరింత శోభను తీసుకొస్తున్నారు. గతంలో ఇంట్లో పెంచిన గోరింటాకు ఆకులను రుబ్బి చేతులకు పెట్టుకునే వారు.

ప్రస్తుతం మార్కెట్‌లో లభించే మెహందీ కోన్లతో అరబిక్, బ్రైడల్, ఫ్లోరల్, రాజస్థానీ వంటి ఆధునిక డిజైన్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ సహజ గోరింటాకు వాడకాన్ని చాలామంది మహిళలు ఇప్పటికీ ప్రాధాన్యంగా భావిస్తున్నారు.

గోరింటాకు విశిష్టత

ఆషాఢం, శ్రావణ మాసాల్లో గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది చేతులకు అందాన్ని తీసుకురావడమే కాకుండా చల్లదనాన్ని అందిస్తుందని పెద్దలు చెబుతున్నారు. వివాహాలు, వ్రతాలు, పండుగల సందర్భంగా గోరింటాకు సంప్రదాయంలో విడదీయరాని భాగంగా నిలిచింది.

పండుగ సీజన్ నేపథ్యంలో  కాస్మెటిక్ దుకాణాలు, తాత్కాలిక స్టాళ్లలో మెహందీ, కోన్ల విక్రయాలు పెరిగాయి. బ్యూటీ పార్లర్లలో కూడా ప్రత్యేక మెహందీ డిజైన్ల కోసం మహిళలు ముందస్తు బుకింగ్లు చేసుకుంటున్నారు. రసాయనాలు అధికంగా కలిగిన మెహందీ కంటే సహజ గోరింటాకును ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.