05-02-2026 01:02:04 AM
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు పూర్తి చేయాలి
సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్
జాతర పోస్టర్ ఆవిష్కరణ
పాపన్నపేట, ఫిబ్రవరి 4: మహాశివరాత్రిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధి లో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించే మహా జాతర కీర్తిని ఎల్ల లు దాటేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మహా జాతర ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సూచించారు. బుధవారం ఏడుపాయల్లోని హరిత హోటల్ లో అదనపు కలెక్టర్ నగేష్, పోలీసు ఉన్నతాధికారులు, ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు వైభవోపేతంగా నిర్వహించనున్న జాతర ఏర్పాట్ల ప్రగతి, పార్కింగ్ ప్రణాళిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ముఖ్యంగా పార్కింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భక్తుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అని పేర్కొన్నారు. ఆలయ పరిసరంలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధు లు నిర్వహించాలని పేర్కొన్నారు. జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, నాగ్సన్పల్లి సర్పంచ్ సుశీల, తహసిల్దార్ సతీష్ కుమార్, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.