27 March, 2026 | 4:25 AM

జిల్లా గిరిజన మహాసభను విజయవంతం చేయాలి

27-03-2026 12:58 AM

తాడ్వాయి, మార్చి, 26(విజయక్రాంతి): ఈనెల 30న జరిగే జిల్లా గిరిజన మహాసభను విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మోతీరాం నాయక్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పిర్మాయకుంట తండాలో గురువారం ఆయన గిరిజనులతో కలిసి సంఘం జిల్లా మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మోతిరాం నాయక్ మాట్లాడుతూ... పిర్మయకుంట తండాలో చాలామంది గుడిసెలలో నే నివాసం ఉంటున్నారని ప్రభుత్వం వెంటనే అర్హులైన గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈనెల 30న జరిగే గిరిజన జిల్లా మహాసభకు పెద్ద ఎత్తున గిరిజనులు తరలిరావాలని కోరారు. ఆ సభలో గిరిజనులకు సంబంధించిన అనేక తీర్మానాలు చేయబోతున్నామని తెలిపారు. రాబోయే కాలంలో పోరాటాన్ని ఎలా విస్తృతం చేయాలో సభలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ నాయక్, కిషన్ నాయక్, చందర్ నాయక్, శంకర్, సక్కుబాయి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.