11-02-2026 02:27:26 AM
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అందుకే భయంతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న అబద్ధాలు, మోసపూరిత వ్యాఖ్యలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు. బీజేపీకి, కాంగ్రెస్ మధ్యనే తీవ్రమైన పోటీ ఉందని, కానీ బీజేపీ గెలుపును అడ్డుకోవాలనే ఉద్దేశంతో త్రిముఖ పోరు ఉందని చెబుతున్నారన్నారు. ‘నేను కేసీఆర్‌కు దత్తపుత్రుడి అని అంటున్నా రు.. నేను ఎవరికీ దత్తపుత్రుడిని కాను. వారి కుటుంబంలోనే ఆస్తుల తగాదాలు ఉన్నాయి..
మధ్యలో నన్ను లాగడం ఎం దుకు?’ అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలోని తన నివాసంలో కేంద్రమంత్రి జీ.కిష న్‌రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి బీజేపీకి వచ్చిన అద్భుతమైన స్పందన చూసిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లకు భారీగా డబ్బులు వెదజల్లాలని చూస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మోదీ వచ్చి మో రీలు సాఫ్ చేస్తారా అని అడుగుతున్నారని, మరి మీరు మున్సిపల్ మంత్రిగా ఏమైనా మోరీలు సాఫ్ చేస్తారా? అని ప్రశ్నించారు.
ఈ ఎన్నికలకు కేంద్రంతో సంబంధం ఏ ముందని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి తప్పితే.. చేసేదేమీ ఉండదు... మాటలతో కా లం గడపడమే రేవంత్ రెడ్డి స్టైల్ అన్నారు. ఇప్పటి వరకు ఆరు గ్యారంటీల్లో ఏ హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకొ న్న రేవంత్ రెడ్డికి నా పేరు మార్చే అధికారం ఎక్కడిదని ఫైర్ అయ్యారు.
పార్టీలు, జెండా లు మార్చడం మీకు అలవాటని, కావాలంటే రేవంత్ ఖాన్‌గా పేరు మార్చుకోండని, అవసరమైతే మీరు మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. మజ్లిస్‌తో కాపురం చేసినన్ని రోజులు మేం ఆ కాపురంలో నిప్పు లు పోస్తామని, రజాకార్లతో కలిసి తిరిగినన్ని రోజులు మేం ఇబ్బందులు పెడుతూనే ఉం టామని హెచ్చరించారు. తెలంగా ణకు మో దీ ప్రభుత్వం ఏమిచ్చిందో చర్చకు తాను సిద్ధమని, ఎక్కడ పెట్టినా వస్తానని సీఎంకు సవాల్ విసిరారు.
రోడ్డున పడ్డ బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల అక్రమాలు, అధికార దుర్వినియోగం, అరాచకాలను ప్రజలు మర్చిపోవడం లేదన్నారు. దోచుకుని దాచుకున్న ఆస్తుల కారణంగా బీఆర్‌ఎస్ రోడ్డున పడిందన్నారు. ఆ పార్టీకి పార్లమెంటులో ఒక్క సీటు లేదు.. రాష్ర్టంలో ఒక్క సీటు లే దు.. ‘న ఘర్‌కా.. న ఘాట్‌కా..’ అన్న చం దం గా ఆ పార్టీ పరిస్థితి ఉందన్నారు. ఆ పార్టీకి ఓటేసినా.. మూసీ నదిలో వేసినా ఒక్కటే అని విమర్శించారు.
మక్తల్ ఘటనపై న్యాయ విచారణ జరపాలి
మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప మృతిచెందడం బాధాకరమని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఈ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. బీజేపీ అభ్యర్థులను బెది రించి, అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దౌర్జన్యానికి పాల్పడుతోందని విమర్శించారు. మహాదేవప్పపై ఒత్తిడి చేయడం, భయపెట్టడంతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి , న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
సీఎం పదవి ఏ పార్టీ ఇస్తే అందులో చేరేవాళ్లం కాదు
బీజేపీ.. దేశం కోసం పనిచేసే పార్టీ.. సీఎం పదవి ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీలో చేరే వాళ్లం కాదు.. కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తా అని, కేటీఆర్‌ను జైలులో వేస్తానని ప్రగల్భాలు పలికింది మీరన్నారు. ఇప్పటివరకు ఎంతమంది బీఆరఎస్ నాయకులు ఊచలు లెక్కపెడుతున్నారని, అధికారంలో ఉన్న మీరు.. చెప్పిన వాటిని చేయకుండా.. కేసీఆర్‌ను అరెస్టు చేయకుండా ఎవరు అడ్డుకున్నారన్నారు. కిషన్ రెడ్డి ఎక్కడ అడ్డుకున్నారో చెప్పాలన్నారు. సోనియా గాంధీ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి ఒప్పందం జరగలేదు అని.. వారిని అరెస్టు చేసి నిరూపించాలన్నారు.
గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ భాగస్వామ్యంతో... రాష్ర్టంలో రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది మీరు.. రాష్ర్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా..? కిషన్ రెడ్డా..? నోరుంది కదా అని.. ఏది పడితే అది మాట్లాడుతూ.. నాపై విమర్శలు చేస్తే అర్థం చేసుకోలేని స్థితిలో ప్రజలు లేరని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మాటలతో కాదు.. ఇప్పటికైనా చేతలతో చేసి చూపించు.. చిప్ప కూడు.. తొండలు వదులుతా.. తొక్కుతా.. అంటూ ఉత్త మాటలు తప్పితే వాటిని నిజం చేసి చూపించాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై విచారణ జరుపుతామన్నారు.