కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- ధాన్యం కొనుగోలుపై బీజేపీ ఆందోళనలతో కదిలిన సర్కార్
- నెల రోజులు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాల ప్రారంభం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో రా్రష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రం రీయింబర్స్‌మెంట్ చేస్తుందన్నారు.
తెలంగాణ రైతులకు ఈ పరిస్థితి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. గత సంవత్సరం ఇలాంటి పరిస్థితి లేదని, ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ పంట పండిందని చెబుతున్నారని, మరీ ఎక్కువ పంట పండినా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేంద్రానికి ఇండెం ట్ ఎందుకు పంపలేదన్నారు.
ఎంత ధాన్యం పండింది, ఎంత కొనుగోలు చేయాలి అనే వివరాలు తెలియజేయాలన్నారు. మార్చి 25న ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25న ప్రారంభించారని, అంటే ఒక నెల ఆలస్యం చేశారని మండిపడ్డారు. ఆ కారణంగానే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రాశులుగా పోసి ఉంచాల్సి వచ్చిందన్నారు. నెల రోజుల పాటు ధాన్యం అక్కడే ఉండిపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తే పరిస్థితి వచ్చిందన్నారు.
తాము రైతు గోస--బీజేపీ భరోసా పేరుతో చేపట్టిన యాత్రతో రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడిందని, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు లారీలు తరలించి ధాన్యాన్ని రైస్ మిల్లర్ల వద్దకు తరలిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది రైస్ మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లతో కుమ్మక్కై రైతులు తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అమ్మకుండా తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితిని సృష్టించిందని ఆరోపించారు.
ఎంఎస్‌పీని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమని, కొనుగోలు ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాతే కేంద్రం రీయింబర్స్‌మెంట్ చేస్తుందన్నారు. ధాన్యం కొను గోలు బాధ్యతను తప్పించుకునేందుకు కేం ద్రంపై నెపం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు.
మంత్రులు కేవలం అబద్ధాల ప్రచారంతో గందరగోళం సృష్టించిచ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలిపారు. తమ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు, పోస్టర్లతో తమ పార్టీకి ఎటువంటి సం బంధం లేదని ఆయన తెలిపారు. బీజేపీకి ఆదరణ పెరిగిందని, దాన్ని చూసి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు బీజేపీలో అంతర్గత విభేదా లు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. ఆ పని ఎవరు చేశారో సీసీటీవీ కెమెరాల ద్వారా బయటపడుతుందన్నారు.
నేడు ఢిల్లీలో రాష్ట్ర వేడుకలకు నితిన్ నబీన్
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ దేశంలోని అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారని రాంచందర్‌రావు తెలిపారు. దేశవ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం ఒక అంశమైతే, త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో పార్టీ ఎలా ముందుకు వెళ్లాలి, అలాగే తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై తమకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే ఒడిశా, అస్సాం, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించిందని, అదే విధంగా దక్షిణాదిలో కూడా ఎన్డీయే ప్రభావం పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోందన్నారు.
తెలంగాణపై పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అలాగే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కూడా తెలంగాణవాదులతో కలిసి తెలంగాణ ఫార్మేషన్ డేను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ హాజరవుతారన్నారు.






