ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాట విజయమే
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వేమన
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాట విజయమేనని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వేమన అన్నారు. జిల్లా కేంద్రంలోని సివిల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ భవనంలో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాజకీయ విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులకు జాతీయ కార్యవర్గ సభ్యులు హెచ్ వేమన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని అన్నారు.
దేశంలో విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడేలా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనలను ఖండిస్తూ, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో అసమానతలను తొలగించేందుకు విద్యార్థి సంఘాలు ముందుండాలని, భవిష్యత్తులో కూడా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్న జిల్లా కమిటీకి జాతీయ కమిటీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.






