26 July, 2026 | 5:44 PM

ఇంటి పనివారిని నియమించుకునేటప్పుడు జాగ్రత్త వహించండి

26-07-2026 04:40 PM

హైదరాబాద్: ఇంటి పనివారికి సంబంధించిన దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాలను నివారించేందుకు పనివారిని నియమించుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వారి వివరాలను సరిగ్గా ధృవీకరించుకోవాలని హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలకు సూచించారు. గత రెండేళ్లలో నగరంలో పనిమనుషుల వల్ల 565 కేసులు దొంగతనాల నమోదయ్యాయని, వీటిలో 65 తీవ్రమైనవి కాగా, 500 సాధారణ రకానికి చెందినవని పోలీసులు వెల్లడించారు.

ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివసించే విద్యార్థులు, వృద్ధులు అప్రమతంగా ఉండాలని, ఇంట్లో పనిచేసేవారు భద్రపరచకుండా వదిలేసిన బంగారం, నగదు ఇతర విలువైన వస్తువులను గమనించి, ఆ తర్వాత దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో 173 కేసులు, సికింద్రాబాద్ (88), ఖైరతాబాద్ (77), గోల్కొండ (70), రాజేంద్రనగర్ (63), శంషాబాద్ (49), చార్మినార్ (45) కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చి, ఇంటి పనివారిగా నటిస్తూ ప్రణాళికాబద్ధంగా దొంగతనాలకు పాల్పడే ముఠాల పట్ల పోలీసులు హెచ్చరించారు.

కఠినమైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ, ఉద్యోగులను, పనివారిని నియమించుకునే ముందు యజమానులు వారి ఆధార్, గుర్తింపు పత్రం, ఫోటోలు, శాశ్వత చిరునామా, సంప్రదింపు వివరాలను తప్పనిసరిగా సేకరించాలని అధికారులు పేర్కొన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఉచితంగా లభించే పోలీసు ధృవీకరణ (police verification) ప్రక్రియను తప్పనిసరి చేయాలని వారు చెప్పారు.