7 May, 2026 | 1:03 AM

ప్రజలపై నిత్యావసర భారాలు మోపుతున్న కేంద్రం

07-05-2026 12:15 AM
  1. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  2. సిపిఐ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ప్లకార్డులు, ఖాళీ సీలిండర్లతో ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం, మే 6, (విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశప్రజలకోసం కాకుండా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుండంవల్లే సామాన్య ప్రజలపై నిత్యావసర భారాలు విపరీతంగా పెరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భగా కూనంనేని మాట్లాడుతూ ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలతో సామాన్యుడి వంటిల్లు మండుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.   ప్రజాపంపిణీ వ్యవస్థను అటకెక్కించి పేదల నోటికాడ కూడును లాగేస్తున్నారని, వెంటనే పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అయన డిమాండ్ చేశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను హక్కుగా గుర్తించి నెరవేర్చాల్సింది పోయి, వాటిని వ్యాపార వస్తువులుగా మార్చడం సిగ్గుచేటన్నారు.

దేశంలో ఇంధన కొరతపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికే లేదని, ఇప్పటికైనా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, నాయకులు కంచర్ల జమలయ్య, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, వంగ వెంకట్, ఎస్ కె ఫహీమ్, దీటి లక్ష్మీపతి, కె రత్నకుమారి, మునిగడప పద్మ, కార్పొరేటర్లు, కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల సిపిఐ నాయకులు పాల్గొన్నారు.