11 August, 2026 | 3:46 AM

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి

11-08-2026 12:00 AM

బోధన్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం బోధన్ పట్టణంలో చలో జైలు కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జమ్మిశెట్టి శంకర్ గౌడ్, టీయూసీఐ జిల్లా నాయకులు బండారి మల్లేష్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు పుట్ట వరదయ్య, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్, బీఎల్‌ఎఫ్ కార్మిక సంఘం నాయకులు దాల్ మల్కా పోశెట్టి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు.

రైతులకు నష్టం కలిగించే విధానాలను కేంద్రం అవలంబిస్తోందని, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు, విద్యుత్ సవరణ చట్టం-2025 వంటి చర్యలు రైతులు, కార్మికులు, పేద ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు మటపతి గంగాధరప్ప, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, జిల్లా నాయకులు గోవింద్ సాగర్, ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గైని రాములు, నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాజేశ్వరి, పద్మ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనీఫాతిమా, జమ్మిశెట్టి లక్ష్మి, కళావతి, ఏషాల సావిత్రి, బెల్లిగా గంగమణి, పత్రి ఎల్లయ్య, పేట భాషా సాయిలు, బండారి నాగమణి, మహిళా సంఘం నాయకులు ప్రభాస్, గౌతమ్, సాయిలు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రమ, సునీత తదితరులు పాల్గొన్నారు.