దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు
కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ
వరంగల్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి దక్షిణ రాష్ట్రాల పట్ల ప్రతిసారి కేంద్ర ప్రభుత్వంలో చిన్నచూపే ఎదురవుతున్నదనీ, ఇందుకు అనేక ఉదాహరణలున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఆరోపించారు.
విద్యా, ఆరోగ్య రంగాలను బలోపేతం చేసి ప్రజలను చైతన్యపరిచి దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రించి అభివృద్ధి సాధించి కేంద్రానికి జీఎస్టీ ఎక్సైజ్ పన్నుల రూపంలో అత్యధికంగా నిధులు చెల్లిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రాలకు దామాషాలో నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు.
మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడానికి పురుషాధిక్యత పార్టీలు, ప్రభుత్వాలు ఇష్టపడడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం లభించడం లేదని ఆరోపించారు. కేంద్రం దక్షిణాది రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తుందని, పార్టీల మధ్యన ఉన్న వైశ్యామ్యాల కారణంగా ప్రజాస్వామ్యానికి సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగొద్దని, దేశ ప్రజలందరికీ న్యాయం జరగాలని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఆకాంక్షించారు.






