వికసిత భారత్‌కు పునాది జనగణన
- జనగణన వివరాలు గోప్యంగా ఉంచుతాం
- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): దేశ అభివృద్ధికి కీలక అడుగైన జనాభా గణన 2027 ప్రక్రియకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ‘వికసిత భారత్2047’లక్ష్య సాధనలో ఖచ్చితమైన గణాంకాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా పాల్గొని సమగ్ర సమాచారాన్ని అందిం చాలని పిలుపునిచ్చారు.
ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తో కలిసి పలు వివరాలు వెల్లడించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా జనగణన ప్రక్రియ పై వివరించారు. జనాభా గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో ‘ఇండ్ల జాబితా, ఇండ్ల గణన’ చేపడతారని, మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు.
రెండో దశ గణనను 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి సాంకేతికత ను వినియోగిస్తూ ప్రజలకు ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు https://se.census. gov.in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్ నంబర్తో లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలు సహా మొత్తం 34 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.
నమోదు పూర్తయ్యాక లభించే 11 అంకెల ఐడీ ను భద్రపరచుకోవాలని సూచించారు. స్వీయ నమోదు చేసుకున్న కుటుంబాలు మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు ఐడీ చూపిస్తే సరిపోతుందని, దీంతో గణన ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీయ నమోదు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్, జిల్లా ఎస్పీ తదితరులు ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారని తెలిపారు.
తాను కూడా స్వయంగా నమోదు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జనాభా లెక్కల చట్టం ప్రకారం ప్రజ లు అందించే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ఈ సమాచారాన్ని ఇతర ప్రయోజనాలకు వినియోగించరని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... జనగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపో హలు లేకుండా సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, మున్సిపల్ కమిషనర్ రాజు, సెన్సస్ విభాగ అధికారులు కృష్ణయ్య, నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు.






