4 May, 2026 | 7:06 AM

విద్యార్థులపై ఫీజుల భారం

03-05-2026 12:00 AM

అణగారిన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఈ పథకం అమల్లో ప్రభుత్వాల అలసత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల పాలిట అశనిపాతంలా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో పాదదర్శకత పేరిట రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో మార్గదర్శకాల్లో స్పష్టత లోపించడంతో పెండింగ్ బకాయిల భారం విద్యార్థులపై పడే పరిస్థితి ఏర్పడింది.

కళాశాలల నిర్వహణ భారంగా మారడంతో పెండింగ్ బకాయిల కోసం పట్టుబడుతున్న కళాశాలలు, ఏటికేడు గుట్టలా పేరుకుపోతున్న బకాయిలను చెల్లించలేక సతమత మవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నలిగిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన ఈ పథకం బకాయిలను ఏ ప్రభుత్వం కూడా మొత్తం విడుదల చేయకపోవడం నేడు పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దీంతో నేడు ఆ బకాయిలు రూ.9000 కోట్లకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే నిర్వహణ భారాన్ని మోయలేక రాష్ట్రంలోని పలు కళాశాలలు హైకోర్టు మెట్లెక్కగా, వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని న్యా యస్థానం సూచించింది. హైకోర్టు తీర్పు వెలువడిన దరిమిలా రాష్ట్రం ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును జమచేస్తామని ఓ జీవో తీసుకురావడం గమనార్హం. అయితే, ఇందులో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నగదు జమచేస్తామనడం, విద్యార్థుల నుంచి ఆ నగదును తీసుకోవాలనడం మరో సమస్యకు దారితీసింది.

ప్రభుత్వ సదుద్దేశంతోనే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించి ఉండొచ్చు. కానీ, పథకం అమలు మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడం, ఈ నగదును విద్యార్థుల ఖాతాల్లో ఎప్పుడు జమచేస్తారో పేర్కొనపోవడంతో విద్యార్థి సంఘాలు ఆం దోళనకు దిగాయి.

కాగా, ఫీజుల భారం విద్యార్థులపై మోపడం వల్ల అడ్మిషన్ల కోసం ముందస్తుగా చెల్లింపులు చేయాలని కాలేజీల నుంచి ఒత్తిళ్లు రావచ్చు. దీనివల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, ఫీజు బకాయిలను ఏకకాలంలో లేదా దశలవారీగా విడుదల చేయడంతోపాటు ఈ పథకం లక్ష్యం నీరుగారకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పక తప్పదు. అదే సమయంలో ఈ పథకంలో పారదర్శకతను పెంపొందిస్తూనే, ఉన్నత విద్యన భ్యసించే పేద విద్యార్థులకు భరోసా కల్పించాలి.