20 March, 2026 | 3:45 AM

భద్రాచలంలో ఉగాది నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం

20-03-2026 12:00 AM

భద్రాచలం, మార్చి 19,  (విజయక్రాంతి) : భద్రాద్రి రామయ్య దివ్య సన్నిధిలో నేటి నుండి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో భద్రాద్రి రామయ్య కళ్యాణ శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అటు పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ఏర్పాటుచేసిన అందమైన రంగురంగుల స్వాగత ద్వారాలతో భద్రాచలం భూలోక వైకుంఠాన్ని తలపిస్తోంది. నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు 15 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. 

బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి అర్చకులు స్వామివారికి ఉత్సవాంగ స్నపనం నిర్వహించారు. అనంతరం ఈరోజు సాయంత్రం స్వామివారు ఆలయం నుండి బయలుదేరి గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు  పూజలు నిర్వహించిన అనంతరం పుట్ట మట్టిని సేకరించి ఆ మట్టిని పల్లకిలో ఆలయానికి చేర్చి,సేకరించి తెచ్చిన ఆ పుట్ట మట్టి ద్వారా అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి సన్నిధానంలో ఉన్న నిత్యకళ్యాణ మండపంలో ఆలయ పండితులు పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలు నేటి నుండి 15 రోజులపాటు వైభవోపేతంగా నిర్వహించబడతాయి.   27వ తేదీన శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం నందు మిథిలా స్టేడియంలో సీతారామచంద్ర స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం వేలాదిమంది భక్తుల నడుమ వైభవోపేతంగా నిర్వహిస్తారు.28వ తేదీన శ్రీరామమహాపట్టాభిషేకం కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ రెండు రోజులు జరిగే కళ్యాణం,మహాపట్టాభిషేకం వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఈ 15 రోజులపాటు సాగే శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి తరించాలని అర్చకులు కోరుతున్నారు.