కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్‌గా తాటిపల్లి రాజన్న ఎన్నిక
మంథని కాళేశ్వరం,మే29 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం పాలకమండలి డైరెక్టర్‌గా ఆర్యవైశ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు, మంథని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, సామాజిక కార్యకర్త తాటిపల్లి రాజన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ దేవస్థాన కమిటీలో ఆయనకు చోటు దక్కడం పట్ల ఆర్యవైశ్య సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు, ఆయన అభిమానులు తాటిపల్లి రాజన్న ను కలిసి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
తాటిపల్లి రాజన్న మాట్లాడుతూ... స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ఆర్యవైశ్య సమాజానికి, స్థానిక ప్రజలకు ఆదర్శవంతంగా నిలుస్తానని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖులు మనసారా కోరుకున్నారు. తనను డైరెక్టర్గా నియమించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శీను బాబుకు రాజన్న కృతజ్ఞతలు తెలిపారు.






