ఆ ట్రెండ్ మా సినిమాకు కలిసివస్తుంది
ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. మే 15న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ వేసవిలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. మార్నింగ్ షో విషయం ఏంటో తెలియదు కానీ, టాక్ బయటకు వస్తే సినిమా గురించి అందరికీ తెలుస్తుంది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని ఆశిస్తున్నా.
మొన్ననే ప్రధాని మోదీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, డైరెక్టర్ మధుదీప్, నిర్మాత అరవింద్, డిస్ట్రిబ్యూటర్ రాందాస్, నటీనటులు కూడా మాట్లాడారు. మూవీ టీమ్ అందరూ పాల్గొన్నారు.






