విష సర్పాల భయం భయం!
- ఓకే భవనంలో హెల్త్ సబ్ సెంటర్, అంగన్‌వాడీ నిర్వహణ
- కుంగిన ఫ్లోరింగ్
- పాముల సంచారంతో భయాందోళన
- లక్షల రూపాయలు వృథా
- కనీస సౌకర్యాలు లేని ఆ భవనం..
మణుగూరు, ఆగష్టు 14 (విజయక్రాంతి): ఆ భవనం చుట్టూ ఎటు చూసినా ఎపుగా పెరిగిన చెట్ల వల్ల అటవీ ప్రాంతాన్ని తలపిస్తుంది. ఆ భవనంలో ఒకపక్క హెల్త్ సబ్ సెంటర్, మరోపక్క బండారి గూడెం -2 అంగన్వాడి కేంద్రం ఉన్నాయి. ఆ భవనంలోకి తరచూ పాములు వస్తుండడంతో అంగన్వాడి టీచర్, పిల్లలు, వైద్య సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పైలట్ కాలనీలోని సుమారు నాలుగు సంవత్సరాల క్రితం లక్షల రూపాయలు చిన్నారుల సంక్షేమం, ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడి కేంద్రాన్ని కలిపి లక్షల రూపాయలు వెచ్చించి ఒకే భవన సముదాయంగా నిర్మించారు.
ఈ భవనంలో హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడి సెంటర్ నిర్వహిస్తున్నప్పటికీ బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు. ఆ భవనం చుట్టూ పక్కల మొత్తం చెట్లు పెరిగి చిన్నపాటి వనం లాగా దర్శనమిస్తున్నాయి. అంగన్వాడి సెంటర్ లో దాదాపు పది మంది చిన్న పిల్లలు చదువుతున్నప్పటికీ నిత్యం పాములు వస్తుండడంతో, ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు, ఆ భవనం నిర్మించి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కింద ఫ్లోరింగ్ మొత్తం ఎక్కడికి అక్కడ కుంగి పోయింది.
విష పాములు సంచరించడమే కాకుండా కుంగిన ఫ్లోరింగ్ లోకి చేరి ఆవాసాలు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అని వైద్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది భయపడుతున్నారు. కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు. భవనం నిర్మించేటప్పుడు ఏర్పాటుచేసిన బోరులోని మోటారును గుర్తు తెలియని వ్యక్తులు రెండు దఫాలుగా దొంగలించినట్లు సమాచారం. కనీస అవసరాలకు, తాగడానికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భవనంతో పాటు నిర్మించిన మరుగుదొడ్లు కూడా కృంగిపోవడంతో చిన్నారులకు మూత్రశాలలు కూడా కరువయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో కనీస సౌకర్యాలు నోచుకో లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా చెట్లు పెరిగినప్పటికీ కనీసం వాటి నిర్మూలించాలని సంబంధిత శాఖ అధికారులు కూడా పట్టించుకున్న పాపనా పోలేదు. లక్షల రూపాయలతో నిర్మించిన భవనం నాణ్యత లేకుండా నిర్మించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాపం పసివాళ్లు రోజు విష సర్పాల భయంతో బిక్కుమంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






