27 February, 2026 | 8:47 PM

టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

25-02-2026 12:00 AM

నస్పూర్, ఫిబ్రవరి 24 : జిల్లాలో జరుగనున్న 10 వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య లతో కలిసి మండల విద్యాధికారులు, ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు, రూట్ అధికారులతోవార్షిక పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పది పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

9,703 మంది రెగ్యులర్, 45 మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రం గేటు బయట క్లాక్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా అధికారులు విధులు నిర్వహించాలని కోరారు. మాల్ ప్రాక్టీస్ సంబంధిత వార్తలు ప్రసారమైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు.

పరీక్ష కేంద్రాలకు కేటాయించిన ప్రకారంగా ప్రశ్నాపత్రాలు వెళ్లేలా అధికారులు పర్యవేక్షించాలని, పరీక్షా కేంద్రంలోనికి మొబైల్ ఫోన్లను అనుమతించకూడదని, అభ్యర్థులను లోనికి అనుమతించ సమయంలో పకడ్బందీగా తనిఖీ నిర్వహించాలని తెలిపారు. పరీక్ష సమయం ముగిసే వరకు విద్యార్థులను బయటకు అనుమతించకూడదని సూచించారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.