calender_icon.png 8 February, 2026 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గో బ్యాక్ హరీశ్‌రావు!

08-02-2026 01:53:01 AM

మా కాలనీకి రావద్దంటూ ప్రజల నినాదాలు 

బీఆర్‌ఎస్ నాయకులపై చెప్పులు విసిరిన కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తిరిగి విసిరిన బీఆర్‌ఎస్ శ్రేణులు

గజ్వేల్ మల్లన్నసాగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఉద్రిక్తత

లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

ఆందోళనతో ప్రచారానికి వెళ్లని హరీశ్‌రావు

గజ్వేల్, ఫిబ్రవరి 7: సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో శనివారం బీఆర్‌ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పునరావాస కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్‌లో హరీశ్‌రావు ప్రచారానికి వస్తున్నారని తెలిసి ప్రచార కార్యక్రమం వద్దకు కాంగ్రెస్ నాయకులు, ప్యాకేజీ రాని ప్రజలు తరలివచ్చారు. హరీశ్‌రావు రాకముందే బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు.

ఆ వెంటనే కాంగ్రెస్ నాయకులు, ప్రజలు.. హరీశ్‌రావు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులపై చెప్పులు విసిరారు. బీఆర్ ఎస్ నాయకులు సైతం తిరిగి కాంగ్రెస్ నాయకులపై చెప్పులు విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఆందోళన తీవ్రమవుతుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను, ప్రజలను చెదరగొట్టారు.

ఆ సమయంలో గజ్వేల్‌లో ప్రచారం చేస్తున్న హరీశ్‌రావుకు విషయం తెలి సి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రచారానికి వెళ్లలేదు. బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పునరావాస గ్రామాల కాలనీలోని కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రచారం కొనసాగించారు. కాగా తమను ప్రాజెక్టులో నిండా ముంచారని, తమ వ్యవసాయ భూములన్ని పోయి రోడ్డున పడ్డామని, అడ్డా మీద కూలీలుగా బతకాల్సిన పరిస్థితులు తలెత్తాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.