టెన్నిస్, క్రికెట్ పోటీలు
సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్, సరోజినీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్, సరోజినీ టెన్నిస్ అండ్ క్రికెట్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు అండర్ 10, 12, 14 సంవత్సరాల లోపు చిన్నారులకు టెన్నిస్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఇందులో అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.ఎన్. విష్ణు చేతుల మీదుగా అండర్ టెన్నిస్ సింగిల్స్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ విజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఐదు నుంచి పది సంవత్సరాల తర్వాత, ఈ పిల్లలు తమ కోచ్ నేర్పిన క్రమశిక్షణను గుర్తుంచుకుంటారు’ అని అన్నారు. అలాగే, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలలో కూడా ప్రోత్సహించాలని ఆయన కోరారు. సరోజినీ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక సంచాలకులు జి కిరణ్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సంయుక్త ఫెర్టిలిటీ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సంయుక్త రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఫిట్‌నెస్, పోషణ, మానసిక బలం ప్రాముఖ్యత ముఖ్యమన్నారు. నిలకడగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రోత్సహించారు. పోటీల్లో పాల్గొన్నవారికి షర్టుల పంపిణీ చేశారు. వి.ఎన్. విష్ణు తన ప్రసంగంలో, అకాడమీ, స్పాన్సర్ల కృషిని అభినందించారు. వర్ధమాన క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కిరణ్‌రెడ్డి చేసిన కృషి గొప్పదన్నారు.




