26 August, 2026 | 2:16 AM

త్వరగా టెండర్లు

26-08-2026 01:02 AM

మూసీ ఫేజ్-2పై అధికారులకు సీఎం ఆదేశం

  1. ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి 
  2. ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలి
  3. సమీక్షలో రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి) : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్పష్టమైన విధానం రూపొందించాలని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలఫ్‌మెంట్‌పై  సీఎం రేవంత్‌రెడ్డి  ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఫేజ్--2కి వీలైనంత తొంద రగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని, ఇందులో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్త వహించాలని సీఎం పేర్కొన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు అతి తక్కువ వడ్డీకి రుణ సదుపాయాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని, అలాగే టీడీఆర్‌లు జారీ చేసే విషయంలో కూడా ప్రతివారం సమీక్షించాలని అన్నారు.

గండిపేట మంచిరేవుల సమీపంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తక్షణం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. అలాగే, కొత్వాల్‌గూడ బర్డ్స్ పార్క్‌కు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఎంఆర్డీసీఎల్ ఎండీ, జేఎండీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.