3 March, 2026 | 4:17 AM

అడవికే టెండర్!

03-03-2026 12:45 AM
  1. సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు
  2. బ్లాక్‌ల కేటాయింపులో అన్నీ ఉల్లంఘనలే
  3. స్వతంత్ర విచారణ చేసి టెండర్లను రద్దు చేయాలి
  4. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ 
  5.   1,100 ఎకరాల రిజర్డ్ ఫారెస్ట్‌పై అస్పష్టత
  6. హైకోర్టు సూచనలూ పట్టించుకోలేదు
  7. సీఎం, డిప్యూటీ సీఎంకు కేటీఆర్ ఉత్తరం

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని మైనింగ్ బ్లాక్‌ల ఈ--వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏకంగా రిజర్వ్ ఫారెస్టుకే టెండర్ పెట్టారని, 1100 ఎకరాలపై పారదర్శకత లేదన్నారు.  అనుమతులు రాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించారని, అటవీ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండానే ఈవేలంలో సెలెక్టెర్ కంపెనీలకు బ్లాక్‌లను కట్టపెట్టారని ఆరోపించారు.

నిభంధనలకు, హైకోర్టు సూచనలకు పాతరేశారని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరి పి, వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. అలాగే డిప్యూటీ సీఎం, ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి పంపించారు. సూర్యాపేట జిల్లాలో గనుల శాఖ చేపట్టిన మైనింగ్ ఈ--వేలం ప్రక్రియ పారదర్శకతకు విరుద్ధంగా సాగిందని కేటీఆర్ విమర్శించారు.

తన లేఖలో, గనుల శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ నెం.2263906, తేదీ- 30-08- -2024 ప్రకారం చేపట్టిన ఈ-వేలం ప్రక్రియలో విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు, పారదర్శకత లోపాలు ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. పసుపులబోడు, సైదుల్‌నామా, సుల్తా న్‌పూర్ మైనింగ్ బ్లాక్‌ల్లో సుమారు 1,100 ఎకరాల రిజర్డ్ ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ, టెం డర్ పత్రాల్లో చట్టబద్ధంగా అవసరమైన కీలక వివరాలు పొందుపరచలేదని ఆయన ఆరోపించారు.

ముఖ్యంగా మినరల్ బ్లాక్‌ల కచ్చి తమైన అక్షాంశ- కో ఆర్డినేట్లు, అటవీ కంపార్ట్‌మెంట్ వివరాలు, డీజీపీఎస్ సర్వే ధ్రు వీకరణ, వివరణాత్మక సర్వే మ్యాపులు, యూ టీఎం జియో కోఆర్డినేట్లు, అలాగే మినరల్ ఆక్షన్ రూల్స్, 2015, మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957 ప్రకారం అవసరమైన సమగ్ర జియోలాజికల్ నివేదికలు వెల్లడించలేదని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో లోపాలు ఉన్న వేలం ప్రక్రి య చట్టబద్ధతను, పారదర్శకతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

టెండర్ నోటీసు జారీకి ముందే మినరల్ బ్లాక్లను కచ్చితంగా గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. ఈ అక్రమ టెండర్లపై మరింత ఆందోళన కలిగించే అంశాలను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు.

న్యాయపరమైన విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు పిల్ నెం.21 ఆఫ్ 2024 లో ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.

సైదుల్‌నామా బ్లాక్‌కు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్‌పూర్ బ్లా క్‌కు ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలను ప్రిఫర్డ్ బిడ్డర్లుగా ప్రకటించారని, ఈ సంస్థలు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్నాయని కేటీఆర్ తెలిపారు. అలాగే, మైన్స్ అండ్ జియోలజీ శాఖ లీగల్ ఆఫీసర్ ఈ బ్లాక్‌ల సమాచారాన్ని గోప్యంగా పేర్కొంటూ ఫిర్యాదుదారునికి ఇవ్వడానికి నిరాకరించడం పారదర్శకతపై అను మానాలు పెంచుతోందని అన్నారు.

అటవీ శాఖ నుంచి తప్పనిసరిగా పొందవలసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండానే వేలం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయని, రిజర్వ్ ఫారె స్ట్ ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మైనింగ్ జరగడం పర్యావరణానికి ముప్పు కలిగించడమే కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత వేలం ప్రక్రియకు సంబంధిం చిన అన్ని చర్యలను తక్షణమే నిలిపివేయాలని, నోటిఫికేషన్ నెం. 2263906/2023 కింద చేపట్టిన టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని, స్వతంత్ర, పారదర్శక విచారణను నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని, అవసరమైన శాస్త్రీయ సర్వేలు, జియోలాజికల్ డేటా వెల్లడి, అటవీ అనుమతులు పొందిన తర్వాత మాత్ర మే చట్టబద్ధంగా కొత్త టెండర్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీఎం తక్షణమే జోక్యం చేసుకో వాలని కేటీఆర్ కోరారు. ఈ లేఖ ప్రతులను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి కూడా పంపారు.