నెల రోజులపాటు ‘పది’ పరీక్షలు
నేటి నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహణ
పరీక్షల మధ్య మూడు, నాలుగు రోజుల విరామం
సెలవు దినాల్లో పాఠశాలల్లో స్పెషల్ కోచింగ్
మేడ్చల్ జిల్లాలో పరీక్ష రాయనున్న 49,999 మంది విద్యార్థులు
237 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
మేడ్చల్, మార్చి 13 (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలను ఈ యేడు ప్రభుత్వం వినూత్నంగా నిర్వహించనుంది. గతంలో పరీక్షలు ప్రారంభమైన వారం, పది రోజుల్లో పూర్తయ్యేవి. ఆదివారం, ఇతర దినాల్లో మాత్రమే సెలవు ఉండేది. వరుసగా పరీక్షలు జరిగేవి. ఈసారి పరీక్షల మధ్య మూడు, నాలుగు రోజుల విరామం ఉంది.
విద్యార్థులు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలని ఉద్దేశంతో విరామం ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అధికారు లు ఏర్పాట్లు పూర్తి చేశారు. 14వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 15వ తేదీన ముగియనున్నా యి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 903 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 49999 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లాలో 237 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్ నియమించారు. డివో, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 2,769 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పది పోలీస్ స్టేషన్లో, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో 11 పోలీస్ స్టేషన్‌లు పరిధిలో 8 రూట్లలో బందోబస్తు మధ్య ప్ర శ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు.
విరామంలో విద్యార్థులు పాఠశాలకు రావాలి
పరీక్షల మధ్య విరామంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. సబ్జెక్టు టీచర్లు కూడా పాఠశాలకు వస్తారు. పాఠశాలలో చదువుకోవడమే గాక సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు రోజుల విరామం ఉండడం వల్ల విద్యార్థులు ఆ సబ్జెక్టుల్లోని అన్ని అంశాలు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది.
విద్యార్థులు హాజరయ్యేనా?
ప్రశాంతంగా పరీక్ష రాయడానికి, చదువుకోడానికి మరింత అవకాశం కల్పించడానికి విరామం ఇచ్చి సబ్జెక్టు టీచర్లను పాఠశాలకు రప్పిస్తున్నప్పటికీ విద్యార్థులు హాజరవుతారా అనేది సందేహంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో హాల్ టికెట్లు తీసుకున్న తర్వాత చాలామంది విద్యార్థులు పాఠశాల వైపు తిరిగి చూడలేదు. 14వ తేదీన మొదటి లాంగ్వేజ్ పరీక్ష ఉంది. శుక్రవారం వరకు చాలామంది విద్యార్థులు మొదటి లాంగ్వేజ్ చదువుకోడానికి పాఠశాలకు రాలేదు. మిగ తా సబ్జెక్టు కూడా వస్తారో లేదోనని ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలని ఉద్దేశంతో ప్రభుత్వం మూడు నాలుగు రోజుల విరామం ఇచ్చింది. ఈ సమయంలో సబ్జెక్టు టీచర్లు పాఠశాలకు వస్తారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
శంకరయ్య, మండల విద్యాధికారి, మేడ్చల్




