తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో జెండాలు ఎగురవేసి వేడుకలను ఘనంగా జరపాలని చెప్పారు. డివిజన్ లలో ఉదయం జెండాలను ఎగురవేసిన అనంతరం అమీర్ పేట లోని సత్యం థియేటర్ సర్కిల్ లో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో ఉదయం 10.00 గంటలకు నిర్వహించే వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని అన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సన్మానించనున్నట్లు తెలిపారు.






