సైబరాబాద్ కమిషనరేట్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం
- సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్
శేరిలింగంపల్లి, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ 12వ వార్షికోత్సవం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో జూన్ 2న ఘనంగా నిర్వహించారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, (ఐపీఎస్) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’తో కార్యక్రమం ప్రారంభమైంది.డా. రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి భద్రతలో పోలీసుల పాత్ర కీలకమని, సైబరాబాద్ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని అన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనకు అందరి సహకారం కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి మహోన్నత సేవా ఉత్తమ సేవా పతకాలు ప్రదానం చేశారు.
హైదరాబాద్ మహిళా మండలుల సమాఖ్య ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నుంచి 28 మంది చిన్నారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొని సీపీ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ డీసీపీలు, ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






