24 May, 2026 | 3:05 AM

పర్సంటేజీ ఇస్తేనే పెద్దిని ఆడిస్తాం

24-05-2026 01:44 AM

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం 

తెలంగాణ చలనచిత్ర పరిశ్రమలో మరోమారు రగల్ జెండా ఎగిరింది. ఎగ్జిబిటర్లు (థియేటర్ల యాజమాన్యాలు), నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదం తీవ్రరూపం దాల్చింది. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసులో సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్లు.. ఇకపై రాష్ట్రంలో రెంటల్ విధానానికి స్వస్తి పలికి, కేవలం పర్సంటేజ్ ప్రాతిపదికన మాత్రమే సినిమాలు అడిస్తామని స్పష్టం చేశారు. ‘పెద్ది’ సినిమా నుంచే ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, నిర్మాతలు సంతకం చేసి హామీ ఇస్తేనే థియేటర్లు ఇస్తామని పీటముడి బిగించారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఈ సమస్యను గతంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలోనే ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. అప్పట్లో రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని వారు ఆరోపించారు. నిర్మాతలు కావాలనే కాలయాపన చేస్తున్నారని, తొలుత మూడు వారాల గడువు అని చెప్పి, ఇప్పుడు మళ్లీ ఇంకొక మూడు వారాలు వాయిదా వేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఉన్న ఛాంబర్ కమిటీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కాదు, ‘గిల్డ్ ఫిల్మ్ ఛాంబర్’లా మారుతోందని విమర్శించారు. గత 10, 15 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం థియేటర్ల వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, దాదాపు 120 మందికిపైగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు దయనీయ స్థితిలో ఉన్నారని సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు కనీస రెవెన్యూ రావడం లేదని, కానీ నిర్మాతలకు మాత్రం థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఆడియో వంటి సుమారు 14 రకాలుగా ఆదాయ మార్గాలు ఉన్నాయని గుర్తుచేశారు.

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానమే విజయవంతంగా నడుస్తోందని, ఇక్కడ మాత్రం పాతకాలపు రెంటల్ సిస్టమ్‌ను రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. థియేటర్ల గ్రేడింగ్‌ను వాటి సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాకుండా, అక్కడ వచ్చే కలెక్షన్ల ఆధారంగానే చేయాలని డిమాండ్ చేశారు. ‘పెద్ది’ సినిమాతో తమకు ఎలాంటి వ్యక్తిగత పగ లేదని, నిజానికి ఆ సినిమాను ఈ వివాదం నుంచి మినహాయించాలని అనుకున్నామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.

అయితే ‘పెద్ది’ లాంటి భారీ సినిమాను కూడా వదిలేస్తే, ఆ తర్వాత తమ సమస్యను నిర్మాతలు అస్సలు పట్టించుకోరనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైతే తామంతా కలిసి మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలుస్తామని, తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లి పెద్దరికంతో సమస్య సద్దుమణిగేలా కృషి చేస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నాయకులు ప్రకటించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ‘పెద్ది’ సినిమాకు రేట్ల పెంపు ఉండొచ్చేమో కానీ, తెలంగాణలో మాత్రం టికెట్ ధరలను పెంచవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి, అలాగే ఫిల్మ్ ఛాంబర్‌కు తాము ముందే లేఖలు రాసినట్లు తెలిపారు. టికెట్ రేట్లు విపరీతంగా పెంచి ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేయవద్దని వారు కోరారు.

ఒకవేళ ప్రభుత్వం గానీ, నిర్మాతలు గానీ టికెట్ ధరలు పెంచేలా నిర్ణయం తీసుకుంటే, అప్పుడు మార్కెట్‌లోని డిమాండ్, సప్లై ఆధారంగా ఎగ్జిబిటర్లుగా తాము కూడా తదుపరి చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

‘పెద్ది’కి అడ్డొస్తే ఆమరణ దీక్షకు సిద్ధం: నట్టి కుమార్ 

‘పెద్ది’ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమస్యలు సృష్టించడం సరికాదని డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. శనివారం ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. “కావాలని ‘పెద్ది’ రిలీజ్ సమయంలోనే ఎగ్జిబిటర్లకు సమస్యలు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉంది. వీరి వెనుక సురేశ్‌బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ వంటి నలుగురు ఉన్నారు.

ఈ నలుగురే లీజ్ థియేటర్లను నడుపుతున్నారు. వీరే దీని వెనుక చక్రం తిప్పుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సబ్ కమిటీ ఏర్పాటైంది. ‘పెద్ది’కి సహకరిస్తే తప్పకుండా తాను తగిన సమయంలో కొంతమంది సభ్యులను చిరంజీవి వద్దకు తీసుకుని వెళ్లి, ఎగ్జిబిటర్ల సమస్యలను తెలియజేసేలా కృషి చేస్తా. మంగళవారం రాత్రిలోగా ‘పెద్ది’ సినిమాకు అడ్డు రాకుండా నిర్ణయం జరిగితే సంతోషం. లేకుంటే బుధవారం నుంచి నేను ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటా” అని హెచ్చరించారు. 

పెద్దలు సామరస్యంగా సమస్యను పరిష్కరించండి: బండ్ల గణేశ్ 

నైజాంలో పర్సంటేజీ కోసం ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్న నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేశ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. “సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో మనందరికీ ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా అవసరం. తెలుగు సినిమా గౌరవం, థియేటర్ల భవిష్యత్తు, వేలాది కుటుంబాల జీవితం సినిమాపైనే ఆధారపడి ఉన్నాయి. ఇటీవల ఇండస్ట్రీలో బాక్సాఫీస్ పరిస్థితులు, థియేటర్ సమస్యలు, విడుదల ఒత్తిడిపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

రాజకీయాలు, విభేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కొంతకాలం పక్కన పెట్టి ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కలిసి ముందుకు రావాలి. పెద్దలందరూ సామరస్యంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించండి. ‘పెద్ది’ రిలీజ్ వరకైనా ఎవ్వరూ వివాదాలు, అనవసర వ్యాఖ్యలు, రాజకీయ అంశాలు తీసుకురాకుండా సహకరించాలని విన్నపం. సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే వేలాది కుటుంబాలు బాగుంటాయి” అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు బండ్ల గణేశ్.