ఎల్లుండి మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet Meeting Scheduled) మే 21న మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడుతుంది. ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులందరూ, మంత్రిమండలి పరిశీలన కోసం సర్క్యులేషన్‌లో సక్రమంగా ఆమోదించబడిన అజెండా అంశాలను, తెలుగు అనువాదంతో పాటు మంగళవారం సాయంత్రం 6 గంటలలోపు సాధారణ పరిపాలన (క్యాబినెట్) విభాగానికి తప్పనిసరిగా పంపాలని ఆదేశించారు.
ఎటువంటి అజెండా అంశాలు లేని పక్షంలో, సకాలంలో 'NIL' నివేదికను పంపవచ్చని ఆయన పేర్కొంటూ, సమావేశం జరుగుతున్న సమయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులందరూ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని కోరారు. అటు తెలంగాణ కేబినెట్ సమావేశంపై సందిగ్ధం నెలకొంది. 21న సరస్వతి అంత్య పుష్కరాలు ఉన్న నేపథ్యంలో మెజార్టీ మంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.






