5 August, 2026 | 9:29 PM

ఇంటి పెరటిలో పోషిక తోటలను ఏర్పాటు చేసుకోవాలి

05-08-2026 08:45 PM

* గరిడేపల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

గరిడేపల్లి,(విజయక్రాంతి): గర్భిణీలు బాలింతలు సమతుల్యమైన ఆహారం కోసం ఇంటి పెరటిలో పోషక తోటలను ఏర్పాటు చేసుకొని తాజా కూరగాయలను సేవించాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన శాస్త్రవేత్త ఎం సుగంది తెలిపారు. మండలంలోని గడ్డిపల్లి అంగన్వాడి కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరమని, మొదటి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయని వివరించారు. గర్భిణీలు, బాలింతలు సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని, రోజువారి ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండు, పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు తో పాటు చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇంటి పెరటిలో పోషక తోటలను ఏర్పాటు చేసుకొని తాజా కూరగాయలను వినియోగించడం ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు ఆహార భయాన్ని కూడా తగ్గించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు భాషరా, అనిత తో పాటు గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.