నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
జవాడే గోపాల్ @ జాదవ్ గోపాల్‌ను చర్లపల్లి జైలుకు తరలింపు..
ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు నమోదు
ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజలను బెదిరించడం, రౌడీయిజానికి పాల్పడడం, మోసాలు చేయడం, దాడులు నిర్వహించడం వంటి పలు నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న జవాడే గోపాల్ జాదవ్ గోపాల్ (37) పిట్టలవాడ, ఆదిలాబాద్‌కు చెందిన నిందితుడిపై పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) నమోదు చేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్ తెలిపారు. నిందితుడిపై ఇప్పటివరకు బెదిరింపులు, రౌడీయిజం, మోసాలు, దోపిడీలు, దాడులు తదితర నేరాలకు సంబంధించి మొత్తం 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
పలుమార్లు కేసులు నమోదైనా తన నేరపూరిత కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో, ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రతను పరిరక్షించేందుకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. పీడీ యాక్ట్ అమలు అనంతరం నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, పునరావృతంగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్ మాట్లాడుతూ... నేరాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా బెదిరింపులు, మోసాలు, దాడులు, రౌడీయిజం వంటి ఘటనలకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.






