డ్రైనేజీ సమస్యతో తేజాపూర్ వాసుల అవస్థలు
వర్షం పడితే చాలు.. చెరువును తలపిస్తున్న వీధులు
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం తేజాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి గ్రామంలోని పలు వీధులు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, వర్షపు నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామంలోని అంతర్గత రహదారులు బురదమయంగా మారడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల మధ్యనున్న వీధులు పూర్తిగా నీటితో నిండిపోవడంతో ప్రజలు అత్యవసర పనుల కోసం కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తలపై సామాన్లు మోసుకుంటూ బురదలో నడవాల్సి వస్తోందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిల్వ నీటితో దోమల బెడద పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టడంతో పాటు వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.






