హైదరాబాద్ ఉద్యోగులకు ట్యాక్స్ బూస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20(విజయక్రాంతి): హైదరాబాద్ లో స్థిరపడి, భారీగా ఇంటి అద్దెలు చెల్లిస్తున్న లక్షలాది మంది సాఫ్ట్వేర్, ప్రైవేట్ ఇతర రంగాల ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టంతో ఉద్యోగుల ట్యాక్స్ ప్లానింగ్, ఆర్థిక స్థితిగతుల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఐటీ హబ్‌లుగా వెలుగొందుతున్న హైదరాబాద్, బెంగళూరు, పుణె నగరాలతో పాటు అహ్మదాబాద్ను ట్యాక్స్ మినహాయింపుల కోసం మెట్రో నగరాల జాబితాలో చేర్చింది.
దీంతో ఇక్కడి ఉద్యోగులు తమ ఇంటి అద్దె భత్యంపై గతంలో కంటే ఎక్కువ పన్ను మినహాయింపు పొందేందుకు అర్హత సాధించారు.గతంలో కేవలం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నాలుగు నగరాల్లో నివసించే ఉద్యోగులు మాత్రమే తమ ప్రాథమిక జీతంలో గరిష్టంగా 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉండేది.
హైదరాబాద్, బెంగళూరు లాంటి నాన్ మెట్రో నగరాల్లో ఉండే ఉద్యోగులకు ఈ పరిమితి కేవలం 40 శాతంగానే ఉండేది. గత ఐదేళ్లుగా హైదరాబాద్ వంటి నగరాల్లో ఇంటి అద్దెలు విపరీ తంగా పెరిగిపోయాయి. తాము చెల్లిస్తున్న భారీ అద్దెకు తగ్గట్టుగా పన్ను మినహాయింపు పొందలేక ఉద్యోగులు నష్టపోతున్నారు. కేంద్రం.. తాజాగా హైదరాబాద్‌ను మెట్రో జాబితాలో చేర్చింది. దీంతో ఇక్కడి ఉద్యోగులు కూడా ఇకపై తమ బేసిక్ జీతంలో 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ కింద చూపి పన్ను ఆదా చేసుకోవచ్చు.




