21 March, 2026 | 10:11 AM

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్

21-03-2026 01:35 AM
  1. బడ్జెట్ ప్రతులను చింపేసిన ఎమ్మెల్యేలు
  2. చెవిలో పూలు పెట్టుకుని నిరసన

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఆర్‌ఎస్ అభ్యంతరం తెలిపింది. బడ్జెట్ పూర్తిగా మోసమని బీఆర్‌ఎస్ సభ్యులు నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను చింపేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. దాంతో అసెంబ్లీలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రభుత్వం ప్రజలను ’చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందంటూ..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ చెవుల్లో పూలు పెట్టుకుని సభనుంచి బయటికి వచ్చారు. ముందుగా బడ్జెట్ ప్రసంగం మొదలవగానే.. ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ముఖ్యంగా ’ఆరు గ్యారంటీల’ అమలు తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం సభ నుంచి బయటికి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఎంట్రీ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు.

’తులం బంగారం మోసం మోసం’ అని నినాదాలు చేస్తూ ప్రభుత్వం పేద మహిళలను వంచించిందని విమర్శించారు. ’రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం’ అని నినదిస్తూ యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ’బడ్జెట్ మోసం మోసం’ అని నినాదాలు చేస్తూ ఈ బడ్జెట్లో పేదలకు, రైతులకు, మహిళలకు ఎలాంటి న్యాయం జరగలేదని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు.