23 August, 2026 | 5:21 AM

టార్గెట్ క్లీన్ స్వీప్‌

23-08-2026 12:00 AM

* స్పిన్ పిచ్‌పై లంకను తిప్పేసిన భారత్ ఇప్పుడు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ కూడా గెలవాల్సిందే. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియాను గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైన శ్రీలంక ఎంత వరకూ అడ్డుకుంటుందో చూడాలి.

  1. లంకతో రెండో టెస్టుకు భారత్ రెడీ
  2. తుది జట్టులోకి సారాంశ్‌జైన్
  3. తీవ్ర ఒత్తిడిలో శ్రీలంక
  4. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం

కొలంబో, ఆగస్టు 22: భారత్, శ్రీలంక రెండో టెస్టుకు కౌంట్ డౌన్ మొదలయింది. ఆదివారం కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇపుడు రెండో మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో పడిక్కల్, రాహుల్‌తో పాటు పంత్ ఫామ్‌లో ఉన్నారు.

అయితే ఓపెనర్లు జైస్వాల్, కెప్టెన్ గిల్ ఫామ్ కలవరపెడుతోంది. తొలి టెస్టులో గిల్ పూర్తిగా నిరాశ పరిచాడు. అందుకే రెండో టెస్టులో ఎలాగైనా సత్తా చాటాలని స్పిన్ బౌలింగ్‌లోనే ఎక్కువ సాధన చేశాడు. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్‌లతో భారత్ మిడిలార్డర్ బలంగా ఉంది. ఈ ముగ్గురు మరోసారి చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ముఖ్యంగా పడిక్కల్ సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. అతనికి మిగిలిన బ్యాటర్లు కూడా సపోర్ట్ అందిస్తే భారత్‌కు తిరుగుండదు.

కొలంబో పిచ్, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటర్లు ఆరంభంలో నిలకడగా ఆడి, పాత తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు భారత బౌలింగ్ విభాగంలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పేస్ ఎటాక్‌లో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ కొనసాగనుండగా స్పిన్ విభాగంలో మాత్రం ఒక మార్పు ఖాయంగా కనిపిస్తోంది. గాలే టెస్టులో కుల్దీప్ తీవ్రంగా నిరాశపరిచాడు.

రెండు ఇన్నింగ్స్‌లతో కలిపి మొత్తం 25 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై కుల్దీప్ తడబడటంతో, అతడిని కొలంబో టెస్టు నుంచి తప్పించి సారాంశ్ జైన్‌కు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. మరోవైపు శ్రీలంక జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది.

కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవ్వడం లంక జట్టును కలవరపెడుతోంది. ఆ జట్టులో కమీల్ మిశ్రా, సహన్ ఆరాచీలు కొత్తగా జట్టులోకి వచ్చారు. కొలంబో పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు కూడా సహకరించే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా 

భారత్ : జైస్వాల్, గిల్, పడిక్కల్, కేఎల్ రాహుల్, జురెల్, పంత్, జడేజా, కుల్దీప్/సారాంశ్‌జైన్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ 

శ్రీలంక : కమిల్ మిశ్రా, ఉదార, సూర్య బండార, కమిందూ మెండీస్, ధనంజయ డిసిల్వా, సోనల్ దినుష, డిక్ విల్లా, నువంతా, ప్రభాత్ జయసూర్య, లహుర కుమార, ఫెర్నాండో