అవినీతి, అక్రమాలకు అడ్డగా మారిన తాండూరు
ప్రభుత్వ భూములే టార్గెట్.
ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తున్న అక్రమార్కులు.
తాండూరు, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం(Tandoor town) అవినీతి అక్రమాలకు అడ్డగా మారింది. కొందరు అక్రమార్కులు అధికార పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ భూములే టార్గెట్గా కబ్జాలకు పాల్పడుతున్నారు. పట్టణం నడిబొడ్డులో ఆర్డిఓ కార్యాలయం ముందు ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 111 కబ్జా చేసిన అక్రమార్కులు దుకాణ సముదాయాలను నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని విజయ విద్యాలయ హై స్కూల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ లంక పాండు తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేశారు.
ఈ భూమిని ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు బోర్డును సైతం ఏర్పాటు చేశారు. వి బి హెచ్ ఎస్ ప్రభుత్వ భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అక్రమార్కులు తప్పుదోవ పట్టిస్తున్నారని లంక పాండు ఆరోపిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 129,130 లలో ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ కూడా అక్రమార్కులు ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేసి కట్టడాలు సైతం నిర్మిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ కమిషనర్ మధుసూదనారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు తీసుకున్నకే నిర్మాణాలు చేపట్టాలని అంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని పనులను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోనే ప్రముఖ దేవాలయంగా పేరొందిన
శ్రీ భద్రేశ్వర స్వామి దేవాలయ దుకాణం సముదాయంలో సైతం అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్దముల్ మండలం ఇందూరు మాజీ ఎంపిటిసి స్వర్గీయ ప్రవీణ్ పటేల్ అప్పట్లో కోర్టులో కేసు వేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం దుకాణాలు మూసి ఉంచాలని కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో కొన్ని రోజులపాటు దుకాణ సముదాయం మూత పడింది. ఇలా తాండూర్ పట్టణంలో అవినీతి, ఆక్రమార్కులకు పాల్పడుతున్న వారి భరతం పట్టేందుకు ప్రజలకు ఎమ్మెల్యే ఇచ్చిన ఏడవ గ్యారెంటీ హామీని అమలు చేసి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మధుసూదనారెడ్డిని వివరణ కోరగా అనుమతులు లేకుండా శాశ్వత నిర్మాణాలు చేపడితే తగు చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులో నమోదు చేస్తామని. .ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.




