ప్రజల సంరక్షణ, భద్రత కొరకే తమ మొదటి ప్రాధాన్యత
రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపాలిటీ శనివారం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రత్యేక బృందాల సహాయంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను ప్రత్యేక బోన్లలో బంధించి తరలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. ఇటీవల వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడిన ఘటన దృష్ట్యా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కుక్కలతో పాటు కోతుల బెడదను కూడా నియంత్రించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ ప్రత్యేక కార్యాచరణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పట్టుబడిన వీధి కుక్కలను ప్రభుత్వ నిబంధనల మేరకు స్టెరిలైజేషన్, రేబిస్ టీకాల కోసం సంబంధిత కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. కోతుల బెడద నివారణకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రజలు కొద్ది రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులను ఒంటరిగా బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ఇళ్ల పరిసరాల్లో ఆహార వ్యర్థాలు, తినుబండారాల అవశేషాలను బయట వేయకుండా పరిశుభ్రత పాటిస్తే వీధి కుక్కల సంచారం కూడా తగ్గుతుందని తెలిపారు.పట్టణ ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని, కుక్కలు, కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు కొనసాగిస్తామని అన్నారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ నార్ల రవీందర్ నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






