8 July, 2026 | 1:19 AM

నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ ద్వాదశి సందర్భంగా నూతన ఆలయ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం

08-07-2026 12:27 AM

యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయ సన్నిధిలో ఈనెల 11వ తేదీ (శనివారం) స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ ద్వాదశి సందర్భంగా నూతన ఆలయ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆలయ ఈవో భవానీశంకర్ సమక్షంలో వారు హిందూ ఆలయ, దేవాదాయశాఖ నియమావళి ప్రకారం ఇదే రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ సందర్భంగా సభ్యురాలిగా నియమితులైన విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ చిలప్పగారి విజయరాజంకు ఆలయ అధికారులు మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎల్ రాజం, విజయరాజం దంపతులకు వేద పండితులు స్వామివారి ప్రసాదాన్ని అందించి ఆశీర్వదించారు. ఆమెకు దేవస్థాన పాలనాధికారి, అర్చకులు, పాలన సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నృసింహస్వామి సన్నిధిలో భగవత్ సేవతోపాటు భక్తుల సేవ చేసే అదృష్టం స్వామివారి మహాప్రసాదమని విజయరాజం పేర్కొన్నారు.