‘సీజనల్’పై అలసత్వం వహిస్తే చర్యలు
డీఎం అండ్ హెచ్‌ఓ స్వర్ణకుమారి హెచ్చరిక
రంగారెడ్డి, జులై7(విజయక్రాంతి): వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణ కుమారి ఆదేశించారు.మంగళవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమీ క్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అనుమానిత కేసులను వెంటనే గుర్తించి తగిన చికిత్స అందించాలన్నారు.
పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నివారణ చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డా. కళ్యాణ్ చక్రవర్తి, ఉప జిల్లా వైద్యాధికారి డా. పూనమ్ తదితరులు పాల్గొన్నారు.






