20 August, 2026 | 4:02 AM

జానీ మాస్టర్‌పై సస్పెన్షన్ అలాగే..

20-08-2026 01:20 AM

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సస్పెన్షన్‌ను కొనసాగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చెలరేగిన అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదం నేపథ్యంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో జరిగిన అత్యవసర జనరల్ కౌన్సిల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో విధించిన సస్పెన్షన్‌నున పెద్దల జోక్యంతో ఎత్తివేసినప్పటికీ, జానీ మాస్టర్ తిరిగి ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో నిషేధాన్ని పునరుద్ధరించారు.

ఫెడరేషన్‌కు చెందిన 23 క్రాఫ్టుల సభ్యులు ఎవరూ జానీ మాస్టర్‌తో కలిసి పనిచేయరని ప్రకటించారు. పలువురు సినీ పెద్దల మాటలను పక్కనపెట్టి, డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ సతీమణి సుమలత ఏకపక్షంగా నిర్వహించిన ఉపఎన్నికలను ఫెడరేషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నూతన కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి ఎలాంటి సహకారం ఉండదని, అయితే సాధారణ డ్యాన్సర్లకు మాత్రం వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.