27 August, 2026 | 6:43 AM

బోధన్‌లో 22 సొసైటీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ

27-08-2026 01:44 AM

ఒక్కో సొసైటీకి ఇద్దరి చొప్పున పోటీ?

సీనియర్లకు అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్ శ్రేణులు

నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ల ఎంపికకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కసరత్తు

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపైనా కొనసాగుతున్న ఉత్కంఠ

బోధన్, ఆగస్టు 23 (విజయక్రాంతి): బోధన్ నియోజకవర్గ పరిధిలోని సహకార సంఘాల (సొసైటీ) చైర్మన్ పదవుల భర్తీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బోధన్, ఎడపల్లి, రెంజల్, సాలూర, నవీపేట్ మండలాల పరిధిలో మొత్తం 22 సొసైటీ చైర్మన్ పదవులకు నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ పదవుల కోసం ఒక్కో సొసైటీ నుంచి ఇద్దరి చొప్పున ఆశావహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తుండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

సీనియర్ల మధ్య పోటీ

సహకార సంఘాల చైర్మన్ పదవులు తమకు దక్కాలని పలువురు కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సొసైటీకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో స్థానికంగా నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు అవకాశం కల్పించాలని ఆశావహులు ముఖ్య నాయకులను కలిసి తమ అభ్యర్థిత్వాన్ని వినిపిస్తు న్నట్లు సమాచారం.

పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ డిమాండ్

సొసైటీ చైర్మన్ పదవులను కేవలం రాజకీయ సమీకరణాల ఆధారంగా కాకుండా పార్టీకి విధేయత, సీనియారిటీ, ప్రజల్లో ఉన్న పరిచయం, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం ముందుకు వచ్చే వారికంటే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే నిర్ణయంపైనే ఆశలు

బోధన్ నియోజకవర్గంలోని సొసైటీ చైర్మన్ పదవుల భర్తీ విషయంలో ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లను ఎంపిక చేసేందుకు ఆయన స్థాయిలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సొసైటీకి ఆశావహుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం ఎమ్మెల్యేకు సవాలుగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకరికి పదవి దక్కితే మరొకరికి అసంతృప్తి కలిగే పరిస్థితి ఉండటంతో నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపైనా ఉత్కంఠ

ఇదిలా ఉండగా బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న అంశంపైనా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై పలువురు సీనియర్ నాయకులు ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని కొందరు కోరుతుండగా, కొత్త వారికి అవకాశం కల్పించాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న ఆశావహులు తమకు ఉన్న రాజకీయ అనుభవం, పార్టీతో ఉన్న అనుబంధం, ప్రజల్లో తమకున్న బలం వంటి అంశాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరి వైపు మొగ్గు?

సొసైటీ చైర్మన్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విషయంలో చివరకు అధిష్ఠానం ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 22 సొసైటీలకు సంబంధించి ఆశావహుల జాబితాపై ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తంగా బోధన్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ రాజకీయ వేడిని పెంచుతోంది. సొసైటీ చైర్మన్ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా? పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తారా? లేక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది త్వరలో తేలాల్సి ఉంది. చివరి నిర్ణయం వెలువడే వరకు ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగనుంది.