ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
వైద్య సేవల నిర్లక్ష్యంపై మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అసంతృప్తి
ఖానాపూర్, జులై 6 విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ‘విజయక్రాంతి’ ది నపత్రికలో వచ్చిన ’ సర్కారు దవాఖానాల్లో ఆరోగ్య సుస్తి’ అన్న శీర్షికకు స్పందించి ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆకస్మికంగా ఆరా తీశారు. సేవలపై ఆసుపత్రిలో పారిశుధ్యం నిర్వహణ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు సరైన వైద్యం అందించడంలో సిబ్బంది విఫలమైనట్టు ఆయన ఆరోపించారు.
ముగ్గురు పీడియాట్రిస్టులు ఉండగా వారిలో ఇద్దరు విధుల్లో లేకపోవడం, తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న రోగులకు రోజుల తరబడి వైద్యం అందించడంలో ఆంతర్యం ఏమిటని ఆమె వైద్యులను ప్రశ్నించారు. ముందుగా ఆమె రోజువారి ఓపి రిజిస్టర్ను పరిశీలించారు, 300కు పైచిలుకు ఓపి వస్తున్న వారికి సరైన వైద్యం అందించడం లేదని నిలదీశారు. ఎక్స్రే సేవలు నెలల తరబడి లేకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. ఎక్స్రే, ఈసీజీ పరికరాలు నెలల తరబడి పాడైపోయిన పట్టించుకున్న నాధుడు లేడని అన్నారు.
దాంతోపాటు చిన్న పిల్లలకు వైద్యం అందించడంలో ప్లేట్లెట్, రక్త కణాల లెక్కింపు మిషన్లు, ఇంత పెద్ద ఆసుపత్రిలో ఆ సౌకర్యం లేకపోవడం విడ్డూరమని ఆమె అన్నారు. అనంతరం రోగులను ఆమె సందర్శించి వారు ఎన్ని రోజుల నుంచి ఆసుపత్రికి వస్తున్నారు మందులు సరిగా ఇస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.ఒక రోగి తనకు కేవలం గ్లూకోజ్ పెట్టి ఎటువంటి మందులు ఇవ్వలేదని తెలుపడం గమనార్హం. ఆస్పత్రిలో పరిశుభ్రత లోపం, రోగులకు డైట్ ఆహారం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతుందని చైర్మన్ మండిపడ్డారు. ఈ విషయంలో తాను కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఆమె వెంట కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, నాయకులు ఎనగందుల నారాయణ, పలువురు నాయకులు ఉన్నారు.






