అల్ఫోర్స్‌లో ఘనంగా సుందరకాండ జ్ఞానయజ్ఞం
కొత్తపల్లి, మే 8(విజయక్రాంతి):కరీంనగర్ పట్టణం లోని వావిలాలపల్లి లో అల్ఫోర్స్ టైనిటాట్స్ ప్రాంగణంలో సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం రెండో రోజు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్,డాక్టర్ సత్తు మల్లేశం విశిష్ట అతిథిగా హాజరై సంప్రదాయంగా సీతారామచంద్రస్వామి వారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని వేడుకగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కార్యకలాపాల వలన భగవంతున్ని ఆరాధన తక్కువ అవుతున్నదని కానీ ప్రతి ఒక్కరూ భగవంతునితో సాంగత్యాన్ని పెంపొందించుకొని చక్కటి జీవితాన్ని అనుభవించాలని సూచించారు.
నరేందర్ రెడ్డి సారాధ్యంలో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు. తదుపరి విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాముని యొక్క గొప్పతనాన్ని రామాయణం లోని వివిధ ఖండాల గురించి తెలియపరచడానికి మరియు ఇతిహాసాల పట్ల దృష్టిని మల్లింపచేయడానికి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉప్పల ఆంజని ప్రసాద్, మహిపాల్ రెడ్డి , నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






