25 August, 2026 | 1:16 AM

వసతి గృహాల్లోని సదుపాయాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

25-08-2026 12:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ, ఆగస్టు 24(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ గోకుల్ నగర్ లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి  గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా వసతి గృహంలో ఉంటున్న విద్యార్థుల సంఖ్య గురించి ఆరా తీశారు, వారు ఎక్కడెక్కడి నుండి వచ్చారు,అలాగే వసతి గృహం లో ఉన్న సిబ్బంది వివరాలను  కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును, వంటకు ఉపయోగించే పప్పు  దినుసులు, బియ్యం, గుడ్ల నాణ్యత ను పరిశీలించి వాటి సరఫరా గురించిన వివరాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

వంటశాలకి వెళ్లి  భోజన తయారీ తీరు గురించి తెలుసుకొని, విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా, సమయాన్ని వృధా చేయకుండా ఒక లక్ష్యం పెట్టుకొని అందుకు తగ్గట్టు గా కష్టపడాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్చార్జి బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.