మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి
- సమాచారం ఉన్నవారే శక్తివంతులు
- ప్రతి విషయంపై అవగాహన పెంపొందించుకోవాలి
- కిశోర బాలికల స్నేహ సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి
- డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య
గజ్వేల్, మే 29: మహిళల ఆర్థిక బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని డిఆర్డిఓ జయదేవ్ ఆర్య అన్నారు. శుక్రవారం గజ్వేల్ మహిళా మండల సమాఖ్య కార్యాలయంలో సామాజిక నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని, జెండర్ కౌన్సిలింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంబంధించిన కమిషన్ను, స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంజూరైన యంత్రాలు పనిముట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డిఆర్డిఓ జయదేవ్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం వినూత్న రీతిలో ఆలోచిస్తూ పథకాలను రూపొందిస్తుందన్నారు. మహిళలు ప్రతి అంశంపై అవగాహన పెంపొందించుకొని సమాచారాన్ని పొందడం కోసం సామాజిక నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడికి మహిళా సంఘాల సభ్యులు వచ్చి తెలియని విషయాల గురించి తెలుసుకోవాలని సూచించారు.
జెండర్ కౌన్సిలింగ్ కేంద్రాల ద్వారా ఎంతో మంది మహిళల కుటుంబాలు విడిపోకుండా కుటుంబ జీవనాలపై అవగాహన కల్పించామన్నారు. మహిళా సంఘాలతో పాటు కిషోర్ బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న స్నేహ సంఘాల ఏర్పాటుకు మహిళా సంఘాల కృషి చేయాలన్నారు. బాలికల స్థాయిలో తమ సమస్యలను స్నేహితులకే చెప్పుకోగలుగుతారని స్నేహ సంఘాల ఏర్పాటు వల్ల ఇతర బాలికలతో కలిసి సంభాషించుకున్నప్పుడు మనోవికాసం తో పాటు మనోధైర్యం కలుగుతుందన్నారు.
కిశోర బాలికలలో వివక్షతను పారద్రోలేందుకు స్నేహ సంఘాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. గజ్వేల్ మండల సమాఖ్య జిల్లాలోని ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రస్థాయిలో ఆదర్శ సమాఖ్యగా ప్రకటించేందుకు త్వరలో అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు. మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసిన బస్సులను ఆర్టీసీకి అప్పగించడం వల్ల, ప్రతినెల రూ. 70 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిపిఎం ప్రకాష్, ఏపిఎం కిషన్, మండల సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సీసీలు, సిబ్బంది, గ్రామ సమాఖ్యల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వివో ఏలు పాల్గొన్నారు.






