04-02-2026 01:02:39 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ర్టంలో మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీ పీ బి. శివధర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఆయన పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, రామగుండం కార్పొరేషన్ల పరిధిలోని 414 వార్డులతో పాటు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డుల్లో ఈనెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలకు తావులేకుండా, పోలీస్ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా విధులు నిర్వర్తించాలని డీజీపీ సూచించారు. సమావేశంలో హైదరాబాద్ పోలీస్ లీగల్ అడ్వైజర్ శ్రీ రాములు ఎన్నికల చట్టాలను వివరించారు.
ఓటర్లను ప్రలోభపెట్టడం, ఒకరికే ఓటు వేయాలని ఒత్తిడి చేయడం, నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలోనూ నిబంధనలు పాటించా ల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజ నాల కోసం మతపరమైన సంస్థలు, ప్రార్థనా మందిరాలను వాడుకోవడం తీవ్రమైన నేరమని డీజీపీ హెచ్చరిం చారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు.