25 July, 2026 | 5:37 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి

25-07-2026 04:35 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలోని కాటారం మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “పి.ఎమ్. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన” కింద కాటారం గ్రామంలో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటు అంశంపై రెడ్ కో, విద్యుత్తు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. టిజిఎన్పిడిసిఎల్ పరిధిలోని క్లస్టర్-3 కింద కాటారం గ్రామంలోని 700 గృహాలకు మొత్తం 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్టును కేంద్రీయ భండార్, హైదరాబాద్ సంస్థ 180 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా మాడ్యూల్స్ వినియోగించాల్సి ఉంటుందని, ప్రతి మాడ్యూల్‌పై తయారీ వివరాలతో ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్ తప్పనిసరి అని తెలిపారు. గుడిసెలు మరియు ఎత్తైన నిర్మాణాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ప్లాంట్ స్థాపన అనంతరం 5 సంవత్సరాల పాటు ఉచిత నిర్వహణ అందించాల్సి ఉంటుందని, ఏవైనా సమస్యలు తలెత్తిన పక్షంలో 72 గంటల్లో పరిష్కరించాల్సి ఉంటుందని సూచించారు. రెడ్ కో మరియు టిజిఎన్పిడిసిఎల్ నివేదికల ప్రకారం కాటారం గ్రామంలో ఇప్పటివరకు 334 గృహాల సర్వే పూర్తయి, 110 ఇళ్ల రూఫ్‌టాప్స్ గుర్తించగా, 99 గృహాలకు మెటీరియల్ అందించినట్లు తెలిపారు.

సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్ కో డిఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డిపిఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.